శనివారం, డిసెంబర్ 18, 2010

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -2వ రోజు

Misimi Monthly  Stall

దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
దేవుడు కనబడలేదని మనిషి నాస్తికుడైనాడు  
-ఆచార్య ఆత్రేయ
మన ఈ-తెలుగు స్టాల్ కు వచ్చే కొందరు సందర్శకులు కంప్యూటర్లో తెలుగు వ్రాయటం, చదవటం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటే, ఇంత చిన్న విషయం వీరికి 2010 సంవత్సరంలో కూడా తెలియదంటే ఆశ్చర్యం కలుగదా మరి. ఇలాంటి వ్యక్తులు మన స్టాల్ దర్శించినప్పుడు నాకు పైన ఉదహరించిన పాట గుర్తుకొచ్చింది. అందరికీ కంప్యూటర్లో తెలుగు చదవటం, వ్రాయటం వస్తే అప్పుడు ఈ-తెలుగు వాలంటీర్లు నిరుద్యోగులవుతారా?  


Sri K.B.S.Sarma -http://teluguradham.blogspot.com/
పుస్తక ప్రదర్శన లో సాధారణంగా ప్రతిరోజు సాయంత్రం ఎదో ఒక సాహిత్య కార్యక్రమం ఉంటుంది. సమన్యయం  లోపించటంతో ఈరోజు ఎలాంటి సభ లేక పుస్తకావిష్కరణ జరుగ లేదు. సాహిత్య సభలు జరపటంలో, విజయవాడ పుస్తక ప్రదర్శన సంఘం వారు చురుగ్గా ఉంటారని మన ఈ-తెలుగు స్టాల్ కు వచ్చిన బ్లాగర్ తెలుగు రధం కె.బి.ఎస్.శర్మ గారన్నారు. "కాలాన్ని నా రథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాను. నా మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాను." అనేది వీరి నినాదం. ప్రఖ్యాత సాహితీవేత్తల శతజయంతులొచ్చినప్పుడు వీరి బ్లాగ్ లో ఆ మహనీయులపై ప్రత్యేక వ్యాసాలు వెలువరిస్తున్నారు. సంగీత, సాహిత్య విషయాలపై సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించటంలో కూడా వీరికి ఆసక్తి ఉంది.  వీరు వాలంటీర్ గా ఉండి ఈ-తెలుగు కార్యక్రమాలలో పాల్గొనటం ఆనందదాయకం.  


Sri S.Kameswara Sarma -Poet

ఈ రోజు మన స్టాల్ కు వచ్చిన సందర్శకులలో ఒకరు, ఆసు కవి, ప్రాస కవి సాతవిల్లి కామేశ్వర శర్మ. వీరు సూక్తి ప్రాసలు, గిలిగింతల కవితలు, జన శృతులు అనే ప్రాస కవితా సంకలనాన్ని రచించి, ప్రచురించారు. వీరికి బ్లాగు లేదు. వీరి కవితలలో మచ్చుకు ఇవి చూడండి.   

నిశిరాత్రి ముహూర్తపు పెళ్ళిళ్ళు
జాతకబలం పెట్టేరు పెద్దోళ్ళు
నిద్రావస్థ పడేరు వచ్చినోళ్ళు
సగమే ఉన్నారు నచ్చినోళ్ళు  
అతిగారాబం పిల్లలు
అప్పుడప్పుడు వేలం వెర్రులు
అదుపులో ఉంటే దివ్వెలు
లేకుంటే అయ్యేరు శుంఠలు
మితిమీరిన సంపాదన పోటి
దొంగలెక్కలు కోటికి కోటి
ఎవరికోసం ఈ భేటి
మానవసేవకిస్తే దైవంసాటి




Palapitta Books

నిన్నటి  పుస్తక ప్రదర్శన వ్యాసంలో పాలపిట్ట మాస పత్రిక గురించి వ్రాశాను. కాలాభావం వలన నిన్న పాలపిట్ట స్టాల్ లో కాలిడలేదు.నేడు కొంచెం వ్యవధి చిక్కడంతో పాలపిట్ట వ్యవస్థాపకులు గుడిపాటి గారితో ముచ్చటించే అవకాశం కలిగింది. వీరు వార్త దిన పత్రిక లో ప్రత్యేక సంచిక సంపాదకులు. సాహితీ విలువలతో నిండిన,పలు చక్కటి పుస్తకాల సంపాదకుడు, ప్రచురణ కర్త కూడా. 


Musuru-Mudiganti Sujata Reddy


 ఈ స్టాల్ లో నేను ముదిగంటి సుజాతా రెడ్డి ఆత్మకధ -ముసురు కొన్నాను. ఈ పుస్తకం ధర రూ.250/- ఐనా పాలపిట్ట స్టాల్ లో మాత్రం  ప్రత్యేక తగ్గింపు ధర రూ.150/- కే అమ్ముతున్నారు. సుజాతా రెడ్డి పలు సాహిత్య విమర్శ గ్రంధాలు,నవలలు, కధలు,సాహిత్య చరిత్రలు, యాత్రాస్మృతులు,వ్యాసాల రచయిత్రి మాత్రమే కాకుండా  ఇంకా పలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వీరి పుస్తకం ఆంధ్రుల సంస్కృతి -సాహిత్య చరిత్ర (తెలుగు అకాడమీ వారి ప్రచురణ), బి.ఏ. తెలుగు సాహిత్య విద్యార్ధులకు పాఠ్యపుస్తకం.వీరు తెలంగాణా సాయుధ పోరాటాన్ని, స్వాతంత్యోత్తర ఆంధ్రదేశ జీవనాన్ని ప్రత్యష్యంగా చూసి ఉన్నారు. కాల్పనిక సాహిత్యంలో ఎన్ని ఎత్తు పల్లాలుంటవో ఆత్మ కధ లో కూడా  అంతటి వైవిధ్యముంటుంది. అక్కడక్కడా కొన్ని పేజీలు తిరగేస్తే ఆసక్తికరంగా అనిపించింది.ఈ పుస్తకం గురించి వివరంగా మరో మారు వ్రాస్తాను.   
ఈ రోజు నేను సందర్శించిన మరో స్టాల్ -Publications Division, Government of India. ఇక్కడ నేను కొన్న పుస్తకాలు 1) ఫిడేల్ నాయుడు గారు -పాలగుమ్మి విశ్వనాధం రూ.18/- ఇది వైలిన్ వాద్య నిపుణులు ద్వారం వెంకటస్వామి నాయుడి గారి జీవిత చరిత్ర . 2) రాణి రుద్రమదేవి -పింగళి పార్వతీ ప్రసాద్  రూ.11/- ఓరుగల్లు వీర నారి రాణీ రుద్రమదేవి జీవిత చరిత్ర. ఇక్కడ ఆసక్తికరమైన పలు పుస్తకాలు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. మేఘాలయపై ప్రత్యేక సంచిక -యోజన రూ.20/- కూడా ఇక్కడే కొన్నాను.   
నేటికింతే. సెలవు.
Photos: cbrao -Nikon D90

2 కామెంట్‌లు:

GKK చెప్పారు...

చాలా బాగుంది సార్. ముఖ్యంగా
నిశిరాత్రి ముహూర్తపు పెళ్ళిళ్ళు
జాతకబలం పెట్టేరు పెద్దోళ్ళు
నిద్రావస్థ పడేరు వచ్చినోళ్ళు
సగమే ఉన్నారు నచ్చినోళ్ళు. ఇది చాలా బాగుంది.

Unknown చెప్పారు...

పుస్తక ప్రదర్శనను కళ్లముందుంచుతున్నారు భాస్కర్రావుగారూ. అభినందనలు. కేబీఎస్ శర్మగారు చాలా నిబద్ధతతో తెలుగురథాన్ని నడుపుతున్నారు. చాలా మంచి మనిషి. దాదాపు పుస్తక ప్రదర్శన జరిగినన్నాళ్లూ కనిపిస్తారు. కలిసినవాళ్లెవరయినా పరిచయం చేసుకోండి. ఆశుకవిగారి కవితలు బాగున్నాయి. బ్లాగు రాసేలా ప్రోత్సహించాల్సింది.
‘ముసురు’ చదివి ముసురు పట్టకుండా ఉంటారా ఎవరయినా... ఏమో అనుమానమే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి