సోమవారం, మార్చి 23, 2009

పాషాణపాకి విశ్వనాధ:శ్రీశ్రీ

నేపధ్యం

విమర్శకులకు తనదైన రీతిలో బదులిచ్చిన విశ్వనాధవారి వేదనకు కొత్తవారి బదులు పాఠకులు చదివిఉన్నారు.విశ్వనాధవారి వేదన సహేతుకమేనా? ఇంతకీ అసలు ఆ వేదనకు హేతువేమిటి? విశ్వనాధవారి రచనలను పాషాణం అన్న శ్రీశ్రీ విశ్వనాధవారి ఉపన్యాసానికి,ఆ రోజు ఘటనలకు ఎలా స్పందించారో ఈ రోజు తెలుసుకొందాము.

“పాషాణపాకి”
-శ్రీశ్రీ

శ్రీ కొత్త వారికీ, శ్రీ విశ్వనాథవారికీ ఈ మధ్య వేడిగా, వాడిగా వాదోపవాదాలు సాగుతున్నాయి. ఆ మధ్యలో సత్యనారాయణగారు నన్ను కూడా ఇరికించి రెండు శ్రీలను మూడు పెట్టి హెచ్చరించారు. కృతజ్ఞుణ్ని వారిలో తొలినుంచీ ద్యోతకమవుతున్న “హింసాత్మకత” ఈనాటికీ మూడు మొగ్గలూ, ఆరు పిందెలుగా వర్థిల్లుతూనే ఉంది. అయితే వారిలో ఇటీవల ఇంకో సద్గుణం కూడా వెల్లి విరుస్తోంది. అదే “విమర్శనా వైమనస్యం” – చంపనైనా చంపండి కానీ విమర్శించకండి నన్ను – అనడం విశ్వనాథవారి కొక్కరికే చేతనవును. అవును వారు (తమ దృష్టిలో) విమర్శాతీతులు!
పాషాణపాక ప్రభూ! అని మొట్టమొదటిసారి విశ్వనాథవారిని జలసూత్రం సంబోధించాడు. చెళ్ళపిళ్ళకంటే గొప్పకవినని ప్రారంభించిన విశ్వనాథవారు ఇప్పుడు వాల్మీకికన్నా మిన్నని చెప్పుకునేదాకా పెరిగారు. ద్రాక్షకంటె వజ్రం గొప్పదని వీరి వాదం! కాని వీరు వజ్రాలని మనముందు పోసిన రాళ్ళ గుట్టల్లో రకరకాల దోషాలు చాలా ఉన్నాయి. ఆమాట అన్నందుకే కొత్తవారిమీద కవిగారి కోపం!
“చిద్గన ప్రాలేయాంశువున్” మీద చిన్న గలాటా లేవదీశారీయన! నకారం గురువో లఘువో – దానికేంగాని, చిద్గగనందాకా వెళ్ళిన సత్యనారాయణగారి నింకా ప్రాలేయాంశువువెలా వెంటబెట్టిందో నాకు బోధపడలేదు. విశ్వనాథవారి పాపాణపాకాని కిదో చిన్న ఉదాహరణ మాత్రమే.
నేనేదో సభలో దిగాలుపడి కూచున్నానట! “వేడుక చూడవచ్చిన వాణ్ణి” Enjoyed every minute of the show, జలగంవారు నాకు తిరుగులేని జవాబు చెప్పారట! ఏమని? భారతం ఒప్పుకుంటే అందులోనే ఉన్న రామాయణాన్ని ఒప్పుకోవలసిందేనట! సెబాష్! భారతంలో వందలకొద్దీ పుక్కిట పురాణాలున్నాయి! అన్నిటినీ ఒప్పుకోవలసిందేనా?
ఇంతకూ విశ్వనాథవారి మనోవేదనకు కారణం నాకు తెలుసు! వారి వయస్సులో పొగడికలకు పొంగిపోవడమూ, తెగడికలకు కుంగిపోవడమూ ఉండదు. తాము చేసింది తప్పు అనే సంగతి తమ అంతరాత్మలోనే మారు మ్రోగినప్పుడు, నిజమైన వేదన కలుగుతుంది. ఇదే విశ్వనాథవారిని వీడకుండా పీడిస్తున్న వేదన.
ఏమైనా విశ్వనాథవారికి నా మీద నవ్యాజానురాగం ఉందని నాకు తెలుసు. నవ్యాజం ఎందుకంటే – ఇదుగో ఇలాంటి పితూరీలు లేవదీస్తూ ఉంటాననే! అల్లసాని పెద్దన్నగారికి తెనాలి రామకృష్ణుని మీద బహుశా ఇలాంటి అనురాగమే ఉండవచ్చు. తొలినుంచీ విశ్వనాథవారిని గొప్ప కవిగా గుర్తించిన వారి జాబితాలో నన్ను నేను సగర్వంగా కలుపుకుంటున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి