సోమవారం, అక్టోబర్ 30, 2006

నా నెల్లూరు పర్యటన -3


Photo: cbrao

గాంధీ బాటలో ఉద్యమకారుడు సుకుమార్ రెడ్డి

దేశభక్తి ఉద్యమం గానివ్వండి, ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం గానివ్వండి లేక ఎదైనా సేవా ఉద్యమం గానివ్వండి నెల్లూరు ప్రజలలో వీటిగురించిన అవగాహన, చైతన్యం ఎక్కువే. ఆంధ్ర రాష్ట్రానికై ప్రాణాలివ్వటానికి పొట్ట్ శ్రీరాములు వెనుకడుగు వెయ్యలేదు. మధ్యపాన వ్యతిరేకోద్యమం చూడండి. దూబగుంట లో మొదలైన మద్యం వ్యతిరేక ఐక్య వేదిక టెక్కలి నుంచి తెలంగాణ దాక తమ ప్రణాళిక అమలు చెయ్యటంతో, అప్పటి ముఖ్య మంత్రి ఎన్.టి.ఆర్. , సారా నిషేధం, అధికారికంగా చెయ్యక తప్పింది కాదు. అది నెల్లూరు ప్రజల సాంఘిక చైతన్యానికి ఒక సోదాహరణగా నిలిచింది.

ఇక సేవా కార్యక్రమాలకొస్తే, అవి, మన భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండి, పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయి. నెల్లూరులో సాంఘికసేవా కార్యకర్తలకు కొదవలేదు. వారిలోని ఒక విశిష్ట వ్యక్తి తిక్కవరపు సుకుమార్ రెడ్డి. చూడటానికి వీరు పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాలలో తీరికలేకుండ పనిచేస్తూ పెరిగిన గడ్డంతో కనిపిస్తుంటారు. చూడగానే మన దృష్టిని ఆకర్షించేవి వారి చొక్కాపై ఉన్న రక రకాల బాడ్జీలు (అంగీకి తగిలించే బిళ్ళ బొమ్మలు). ఆ బిళ్ళలు పెట్టడం వెనుక గూడా ఒక సేవాతత్పరత కనిపిస్తొంది. ఆ Badges చూసిన వారు అవి ఏమిటని అడగటమూ, వాటి గురించి వారి వివరణా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ బిళ్ళలపై రక్తదాన, నేత్రదానాల అనుకూల నినాదాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలుంటాయి.

సింహపురి స్వచ్చంద రక్తదాతల సంస్థ

మన దేశంలో అనేక వినియోగదారుల సంఘాలున్నాయి. రక్త, నేత్ర బాంకులున్నాయి. అయితే దాతలు సేవ చెయ్యటానికై పొటీపడి స్థాపించిన భారతదెశపు తొలి రక్త సహాయకుల సంస్థ, సింహపురి స్వచ్చంద రక్తదాతల సంస్థ 1979 లో నెల్లూరులో స్థాపింపబడింది. 1987 లో భారతదేశపు తొలి నేత్ర దాతల సంస్థ స్థాపించబడీంది. ఈ రెండు సంస్థలకూ వ్యవస్థాపకుదూ, కార్యదర్శి తిక్కవరపు సుకుమార రెడ్డి.

ఇక రక్తదాన విషయంలో ప్రజలకున్న అజ్ఞానం అపారం. ‘సందిగ్ధం’ కథ లో డాక్టర్ సోమిరెడ్డి జయప్రద చెప్తారు - భార్య ఎంతో అపాయకర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా భర్త రక్తదానానికి వెనుకంజ వెయ్యటం, ఆఖరికి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టిసలాడుతున్న భార్య - వారు ఉద్యోగం చేసే వారు కదా- రక్తం ఇస్తే Job ఎలా చేస్తారు అంటూ డాక్టరును ప్రశ్నిస్తుంది. రక్తదానంపై ప్రజలకున్న అపోహల్ని తొలగించటానికై Nellore V.R.College, Town Hall లలో వేదిక పై రక్తదానాన్ని ఇవ్వటం ఎలాగో demonstration చేసి చూపారు. వీరి బ్లడ్ గ్రూపు అరుదైంది కావటంతో 40+ సార్లు రక్తదానం స్వయంగా చేశారు. రోగికెప్పుడవసరమైతే అప్పుడు రక్తాన్నందజేసే - తక్షణ రక్త మార్పిడీ విధానం (Direct blood transfusion method) లో కూడా పలు రక్తదానాలు, వీరి నేతృ త్వంలో జరిగాయి. మొత్తంగా కొన్ని వేల రక్తదానాలు జరిపించారు సుకుమార్ రెడ్డి. వీరి రక్తదాన సంస్థ అలాంటి మరో 10 సంస్థలు రావటానికి స్పూర్తికారకమైంది.

Nellore Eye Donors Organisation

రక్తదానంలో ముందుండిన సుకుమార్ గారు నేత్రదానంలో వెనకుంటారా? బాంక్ ఉద్యొగి ఆనందరాం సింగ్ గారితో కలసి NEDO (Nellore Eye Donors Organisation) స్థాపించారు. వారి తండ్రి గారి నేత్రాలను దానం చేసి మిగతావారికి స్పూర్తినిచ్చారు. నేత్రాల సేకరణ చాల కఠినమైన ప్రక్రియ. గ్రామా లకు వెళ్ళి నేత్రదానం గురించి గ్రామస్తులకు విశదీకరించి, దాత చనిపొయిన 8 గంటలలోపు కంటి పాపను సేకరించి, చెన్నై లోని ఎగ్మోర్ కంటి బాంక్ కు సకాలంలో అందచేయటం ఒక పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. కంటి సేకరణలో గ్రామాలలో సరైన డాక్టర్ అందుబాటలో ఉండరు కావున తానే స్వయంగా కంటి పాపను సేకరించి, నేత్రాలను థర్మాస్ ఫ్లాస్కులో ఉంచి ఎగ్మోర్ నేత్ర బాంక్‌కు పంపేవారు. ఎన్నో కష్టాలకోర్చి ఇంతవరకూ సుమారుగా 150 నేత్రాలను సేకరించి ఎగ్మోర్ బాంక్ కు పంపినారు.

తొక్కుడు బండి Bicycle

సుకుమార్‌గారు హేతువాది, సంఘసేవకుడు ఇంకా కవి. నా దృష్టికి వీరు రాసిన రెండు కవితలు అ) తొక్కుడు బండి ఆ) పొగాకు శతకము వచ్చాయి. ఇవి కూడ ఒక సామాజిక ప్రయోజనాన్ని దృష్టి లో పెట్టుకుని రాసినవే. సామాన్యుడు వాడే బైసికిల్ కూడా వీరి దృష్టిలో సామ్రాజ్యవాదాన్ని ఎదురించగల సత్తా ఉన్న ఆయుధమని వీరి నమ్మకం. Bicycleను వీరు తొక్కుడుబండి అంటారు. మోటార్ వాహనం నడపటమంటే ముడి చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న దేశాల సామ్రాజ్యవాదానికి మనము చేయూత నిచ్చినట్టేనని వీరి భావన. బైసికిల్‌పై నాలుగు పేజీల దీర్ఘ కవిత రాశారు.

అది జనచైనా వాహనం
అది భారత జన వాహనం
తొక్కుడుబండి అలనాటి పుచ్చలపల్లి సుందరయ్య వాహనం
ఇలనేటి గండవరం సేతురామయ్య, దాన్ని తొక్కి, తొక్కుడుబండి ప్రయాణ
షష్టి పూర్తి వేడుక జరుపుకొన్నారు

తొక్కుడుబండి తొక్కటం మనిషి ఆరొగ్యాన్ని, శక్తిని తెలియచేస్తుందనీ అంటూ ఈ వాహనం
పర్యావరణ కాలుష్యాన్ని పరిరక్షిస్తుందంటారు. మన దేశపుయొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు అదుపుతో ఖర్చవటానికి తోడ్పడుతుందనీ కావున తొక్కుడుబండి తొక్కటం అంటే మనకు దేశ భక్తి ఉన్నట్లే అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే తొక్కుడుబండి మనిషి ఆరొగ్యానికి, దేశ ఆర్ధిక అభివృద్ధికీ ఉపయోగపడుతుంది కావున అందరూ బైసికల్ వాడాలంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న మాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి